
రైతులకు విద్యుత్‌ను అందించడంలో ప్రభుత్వం విఫలం.
మాజీ ఎమ్మెల్యే చిరమర్తి లింగయ్య
నల్లగొండ అక్టోబర్ 14 భారత జ్యోతి.
రైతులకు 24 గంటలు విద్యుత్తు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు.చిట్యాల మండలం వెలిమినేడు సబ్‌స్టేషన్ వద్ద రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో గతంలో ఉన్న పరిస్థితులను మళ్లీ తీసుకొస్తామని చెప్పారని, ఇప్పుడు నిజంగానే రైతులకు విద్యుత్, సాగునీరు సక్రమంగా అందించలేని పరిస్థితులను తీసుకొచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వంటి విద్యుత్ ఉత్పత్తి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నించారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా రైతుల మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
కేసీఆర్ మళ్లీ రావాలి.. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి అని రైతులు కోరుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించి, రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో పాలన సాగించారని గుర్తుచేశారు.ప్రజాసమస్యలను పరిష్కరించాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, రైతులను ఆదుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శించారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని విడనాడి రైతులకు సరిపడా నాణ్యమైన విద్యుత్, సాగునీరు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో రైతుల ఆగ్రహానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
