ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, చేపడుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయాలపై, సీఎం రేవంత్ రెడ్డి మధుయాష్కీ గౌడ్ ఇద్దరి మధ్య చర్చ.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, చేపడుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయాలపై, సీఎం రేవంత్ రెడ్డి మధుయాష్కీ గౌడ్ ఇద్దరి మధ్య చర్చ.
హైదరాబాద్: అక్టోబర్ 20 భారత జ్యోతి.
ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్మధుయాష్కీ గౌడ్ ఏఐపిసి చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ లోని ఎంసీహెచ్ఆర్డీసీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏఐపీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మధుయాష్కీ గౌడ్ కి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి మధ్య సుమారు గంటన్నర పాటు సమావేశం కొనసాగింది.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఫీజు రీయింబర్స్మెంట్స్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ప్రభుత్వంలో చేసిన సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పులపై వడ్డీ భారం తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి త్వరలో మూడేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో, ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరంపై చర్చ జరిగింది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు, గృహ వినియోగ దారులకు ఉచిత కరెంటు, దేశంలో ఎక్కడా లేని విధంగా సబ్సిడీ ధరకే గ్యాస్ సిలిండర్, రైతులకు రుణమాఫీ, సన్న వడ్లకు రూ.500 బోనస్, ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో ఉపాధి కల్పన.. మరీ ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో నూతన కంపెనీలను ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పన తదితర సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వం సాధించిన పురోగతిని ప్రజలకు వివరించాలన్న దానిపై చర్చ జరిగింది. సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్షలు నిర్వహిస్తూ తదనుగుణంగా ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. ఇతర సంస్థలు, కార్యక్రమాల పనితీరును సమీక్షించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ప్రోగ్రెస్ రిపోర్టులు తీసుకుంటున్న తరహాలోనే, ప్రభుత్వ శాఖలు, పథకాల అమలుపైనా క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి నివేదికలు తీసుకోవాలనే అంశం చర్చకు వచ్చింది.
ఏఐపీసీ బలోపేతానికి సహకరిస్తా: సీఎం…
తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ను రాష్ట్రంలో బలోపేతం చేయడంపై కూడా సమావేశంలో చర్చించారు.
ఏఐపీసీ బలోపేతానికి తన వంతు సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రొఫెషనల్స్‌ను భాగస్వాములను చేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై సమర్థవంతమైన చర్చలకు వేదికగా ఏఐపీసీ ను తీర్చిదిద్దే అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. వివిధ రంగాల్లో నిపుణులను ఏఐపిసి ద్వారా ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై వారు సమగ్రమైన నివేదికలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఇటు ప్రభుత్వం గానీ, అటు పార్టీ గాని ప్రొఫెషనల్స్ సేవలను సద్వినియోగం చేసుకొని నూతన పాలసీలు, విధానాలు రూపకల్పనలో భాగస్వామ్యం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి మధుయాష్కి లు అభిప్రాయపడ్డారు.

