
చాంద్రాయణగుట్ట, అక్టోబర్ 16 భారతజ్యోతి : మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని)లో శుక్రవారం హిందీ పక్షోత్సవ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన మిధాని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.వి.ఎస్.నారాయణ మూర్తి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… హిందీ పక్షోత్సవం మన దేశ భాషా వైవిధ్యానికి ఒక వేడుక అన్నారు. మన రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ లో హిందీతో పాటు భారతదేశంలోని 21 భాషలు ఉన్నాయన్నారు. మాతృభాషను ప్రేమించడం చాలా అవసరమన్నారు. మహాత్మాగాంధీ హిందీని ప్రజల భాష (జనభాష) అని పిలిచారన్నారు. స్వాతంత్ర్య పోరాట కాలంలో కూడా వివిధ ప్రావిన్సుల ప్రజలను ఒకే వేదికపై తీసుకురావడానికి హిందీ పని చేసిందన్నారు. మిధాని ఫైనాన్స్ డైరెక్టర్ కె. మధుబాల మాట్లాడుతూ… మిధానిలో హిందీ అమలుకు ఊతం ఇవ్వడంలో హిందీ దీపోత్సవం వంటి కార్యక్రమాలు చాలా అర్థవంతంగా ఉన్నాయన్నారు. ముగింపు కార్యక్రమం సందర్భంగా ఉద్యోగులకు లాటరీ సిస్టమ్ ద్వారా వివిధ వినోదాత్మక ఆటలు నిర్వహించారు. హిందీ పక్షోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హిందీ మేనేజర్ (హిందీ విభాగం అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్) డాక్టర్ బి. బాలాజీ, హిందీ విభాగం అనువాదకులు డాక్టర్ వికాస్ ఆజాద్, ఉద్యోగులు జైపాల్, ప్రేమ్, నరేంద్ర గాంధీ తదితరులు పాల్గొన్నారు.




