దసరా నవరాత్రుల సందర్భంగా వినూత్న తరహాలో అమ్మవారి మండపం ఏర్పాటు..
శ్రీ మాత వైష్ణవి దేవి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి నవరాత్రి పూజలు...

చాంద్రాయణగుట్ట, అక్టోబర్ 16 భారత జ్యోతి : పాతబస్తిలోని పలు ప్రాంతాల్లో దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొగల్ పుర పోలీస్ స్టేషన్ సమీపంలోని పాత పోస్ట్ ఆఫీస్ సుల్తాన్ షాహీ ప్రాంతంలో శ్రీ మాతా వైష్ణవి దేవి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినూత్న తరహాలో అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి నవరాత్రి పూజలను నిర్వహిస్తున్నారు. పడవ ఆకారంలో మండపాన్ని ఏర్పాటు చేసి పడవపైన జాతీయ జెండాతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షులు నితీష్ ఠాకూర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు మహాతేజ, సాయికుమార్, విష్ణు, చక్రధర్, దీపక్, చిన్న, అరవింద్, సాయి, మాధవ్, రోహన్, అమన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




